"మనిషికి శారీరక బలం ఎంత ముఖ్యమో.. 

అంతకన్నా ఎన్నో రెట్లు మానసిక బలం ముఖ్యం!"

  • సంతోషం పెద్ద బరువు ఉండదు.. మోయచ్చు..
  • ఎవరైనా మన సహనాన్ని పరీక్షిస్తే కోపం వస్తుంది. కోపం కూడా పెద్ద బరువుండదు.. మోసేయచ్చు. రోడ్డు మీద ఆకలితో ఉన్న బిచ్చగాడిని చూస్తే జాలి వేస్తుంది. ఆ జాలి కాస్త బరువుగా ఉంటుంది.. కానీ, మోయచ్చు.
  • మనకిష్టమైన వాళ్ళకి కొద్దిరోజులు దూరంగా ఉండాలి అంటే బెంగ వస్తుంది.. అది ఇంకాస్త బరువుగా ఉంటుంది కానీ, మోయచ్చు.
  • కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే, ఆవేశం వస్తుంది.. అది ఇంకొంచెం బరువుంటుంది.. కానీ, ఏదోరకంగా దాన్ని కూడా మోయచ్చు.
  • శరీరానికి ఎక్కడైనా గాయమైతే నొప్పి వస్తుంది, నొప్పి భరించలేక ఏడుపు (దుఃఖం) కూడా వస్తుంది.. కానీ, ఈ రెండూ కూడినా అంత బరువుండవు.. కాబట్టి మోయచ్చు!

కానీ, ఓ సగటు మనిషికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, మన జీవితాలే వాటితో ముడిపడి ఉంటాయి. అవి నెరవేర్చుకోవడం కోసం మనసా-వాచా-కర్మేణా ఎంతో శ్రమిస్తాం, ప్రాణం పెట్టి ప్రయత్నిస్తాం, వాటి గురించి ఎంతో పోరాడతాం.

ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా.. అవి చేతికి అందినట్టే అంది పదే పదే చేయిజారిపోతుంటే, దగ్గరయినట్టే అయ్యి దూరమవుతుంటే.. ఎంతో పటిష్టంగా కట్టుకున్న ఆశల కోట పేక మేడలా కుప్పకూలిపోతుంది! ఆ నిస్సహాయ స్థితిలో మన మనసు పడే మానసిక క్షోభని మోయడం చాలా  కష్టం!

అవి ఎందుకు దూరం అవుతున్నాయో కారణం తెలీదు.. కొన్ని లక్షల అమావాస్యలు ఒక్కసారిగా దాడి చేస్తునట్టు అనిపిస్తుంది! అప్పటి వరకూ అందంగా కనిపించిన ఈ ప్రపంచం సూన్యంలా అనిపిస్తుంది. ఒక పెద్ద చీకటి వలలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది! బాధ, మన మీద మనకి కోపం, ఆవేదన, బెంగ.. ఇన్నింటి మధ్య చిక్కుకుపోయిన మనసుని విడిపించుకోవడానికి మనతో మనమే యుద్ధం చేయాలి! మన ఆలోచనలతో, మన భయాలతో, మన భావాలతో, భావోద్వేగాలతో యుద్ధం చేయాలి!

  • కోపానిదేముంది.. నాలుకని విదిలిస్తే చల్లారుతుంది. 
  • ఆ బిచ్చగాడికి ఏదైనా కొనిచ్చి అతని ఆకలి తీరిస్తే, ఆ జాలి అనే భావన కూడా కాస్త తగ్గుతుంది.. 
  •  కొద్ది రోజులు గడిచేక మన వాళ్ళని ఎలాగో కలుసుకుంటాం అని మన మనసుకి తెలుసు కాబట్టి.. బెంగ కూడా పోతుంది.. 
  • అన్యాయాన్ని ఎదిరించి, లేదా కనీసం ప్రశ్నించి, మనలో ఉన్న ఆవేశాన్ని తగ్గించుకోవచ్చు.. 
  •  కాయానికైన గాయం మాయమవ్వక తప్పదు కాబట్టి ఆ నొప్పి, దుఃఖం కూడా మనల్ని అంత బాధించవు..

కానీ, పరిసితులు పగపట్టి కూల్చి, పేర్చిన మన ఆశల సమాధి చూసి మనసు పడే వేదన మాత్రం వర్ణనాతీతం!!! దాన్ని భరించలేం, తట్టుకోలేం!

అందుకే, మనసుని ముందు నుండీ బలోపేతం చేస్తూ రావాలి! సానుకూలమైన భావాల్ని (positive feelings & emotions) భావోద్వేగాలనే కాదు.. ప్రతికూలమైన పరిస్థితుల (negative situations) వల్ల ఏర్పడే భావాలూ, భావోద్వేగాలను కూడా తట్టుకునే విధంగా మనసుకి తగిన శిక్షణ ఇవ్వాలి, దాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేయాలి! అందుకే, శారీరక బలం కన్నా, మానసిక బలం, బుద్ది బలం కలిగి ఉండటం ఎన్నో రెట్లు శ్రేయస్కరం!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach