There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
"సంతోషానికి మించిన ఐశ్వర్యం, సంతృప్తికి మించిన సౌకర్యం మరొకటి లేవు!"
ఇప్పుడు నేను చర్చించబోయే అంశం చాలా సున్నితమైనది... కానీ, కొన్ని విషయాల గూర్చి మాట్లాడటం, మన ఆలోచనలను, ఆ విషయాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అనేవి పంచుకోవడం చాలా అవసరం! కాబట్టి, విషయాన్ని గ్రహించండి కానీ, అందులో లేని అర్థాన్ని మీకు మీరే అనుకుని, దయుంచి దీన్ని పక్కదారి పట్టించద్దు అని విజ్ఞప్తి చేస్తూ ప్రారంభిస్తున్నాను!
'పరువు'. పరువు అనే ఈ మాట లేదా ఈ అంశం ఎక్కడ పుట్టింది, మన జీవితాల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయాలు నాకు తెలీదు గాని, దీన్ని నేనెలా అర్థం చేసుకున్నాను, నేనెలా అనుసరించాలని చూస్తాను అనేది చెబుతాను. నా వరకూ పరువు అన్నా, పరువుగా బ్రతకడం అన్నా న్యాయంగా, నీతిగా, సాటి మనిషిని, అతని/ఆమె యొక్క స్వేచ్ఛను గౌరవిస్తూ బ్రతకడమే! అంటే, నా దృష్టిలో పరువు పోగొట్టుకోవడం అంటే... అన్యాయంగా బ్రతకడం, ఒక మనిషి యొక్క స్వేచ్ఛను హరించడం లేదా ఆ స్వేచ్చకు భంగం కలిగించడం!
కానీ, చాలా మంది దృష్టిలో 'పరువు' అంటే డబ్బు, పరువు అంటే పలుకుబడి, పరువు అంటే అధికారం కలిగివుండటం, కలిగి ఉన్న వాటిని నిలుపుకోవడం లేదా కాపాడుకోవడం. న్యాయాన్ని సరిగ్గా పాటించకపోయినా, నీతిని అనుసరించకపోయినా, ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛను, లేదా అభిప్రాయాన్ని గౌరవించకపోయినా కూడా పైన చెప్పిన ఆ డబ్బు, పలుకుబడి, అధికారం అన్నీ ఉన్నా, లేదా వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వారికి వాళ్ళు 'పరువు'గల వ్యక్తులుగా పరిగణించుకుంటారు, ప్రకటించుకుంటారు, జనం కూడా వాళ్ళని అలానే చూస్తారు.
ఉన్నతంగా బ్రతకడమంటే విలువైనవి కలిగి ఉండటం కాదు, విలువలను కలిగి ఉండటం. ఇంజనీరింగ్ చదివిన కొడుకు వ్యవసాయం చేస్తానంటే పరువు పోతుంది, కట్టుదిట్టమైన సంప్రదాయాల మధ్య పెరిగిన కూతురు పొట్టి దుస్తులు (అన్ని వేళలా కాదు) ధరించి బ్యాడ్మింటన్ ఆడతానంటే పరువు పోతుంది, పెద్దింటి వాళ్ళు లేనింటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే పరువు పోతుంది... ఇలా ఆ మాటకున్న అసలర్థాన్ని గాలికి వదిలేసి, ఎవరికి వారు సొంతర్ధాల్ని రాసుకుని ఓ భ్రమలో బ్రతికేస్తున్నారు చాలా మంది!
దీని వల్ల ఇష్టంగా బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది! మొదట్లో మన పెద్దవాళ్ళు పెట్టిన కొన్ని నియమాలు అవి మనల్ని ఓ సక్రమమైన మార్గంలో పెట్టి, మనలో మనకి సఖ్యత, స్నేహభావం నెలకొని, మనం ప్రశాంతంగా ఉంటూ, మన చుట్టూ ఉన్నవాళ్ళని ప్రశాంతంగా ఉంచుతూ బ్రతికినంతకాలం ఎలాంటి ద్వేషాలకు, విద్వేషాలకు చోటు ఇవ్వకుండా, వివాద రహితమైన, సంపూర్ణ శాంతి సమాజాన్ని నెలకొల్పడానికి తప్పా, వారు ఆ నియమాలను పెట్టడానికి వెనకున్న ఆ ఉన్నతమైన ఆలోచనలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను త్రోసిపుచ్చి మనకి నచ్చినట్టు, మన సౌలభ్యానికి తగినట్టుగా మార్చేసుకుని బ్రతకడానికి కాదు!
ప్రతీ ఒక్కరికీ వారి జీవితం విలువైనదే... వారికున్న అభిరుచిని బట్టి కొంతమంది నోట్ల కట్ల మధ్య బ్రతకాలనుకుంటారు, ఇంకొంతమంది పచ్చని పంట పొలాల మధ్య బ్రతకాలనుకుంటారు. చట్టానికో, న్యాయానికో, ధర్మానికో వ్యతిరేకంగా బ్రతకనంతవరకూ, ఒకరి స్వేచ్చకు అడ్డుపడనంత వరకూ ఓ మనిషి తన ఇష్టానుసారంగా, మనసుకి నచ్చిన విధంగా ఎలాగైనా బ్రతకచ్చు, ఆ హక్కు మనిషనే ప్రతీ ఒక్కరికీ ఉంది! మీ యొక్క ఇష్టాలకు అడ్డుపడితే మీ మనసుకెంత కష్టంగా ఉంటుందో... పరువు పేరుతో ఒకరి ఆలోచనలకు ఆనకట్ట వేస్తే వారికీ అంతే కష్టంగా ఉంటుంది! ప్రతీ ఒక్కరూ బ్రతికేది ఒక్కసారే... నచ్చినట్టుగా బ్రతికితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది, అలా బ్రతకలేకపోతే వచ్చే బాధ వర్ణించలేనిది. ఎంతైనా, సంతోషానికి మించిన ఐశ్వర్యం, సంతృప్తికి మించిన సౌకర్యం మరొకటి లేవు!
{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach