There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
"నీ ఆలోచనలే నీ జీవితాన్ని నిర్మించే ఇంజినీర్లు"
మనిషి పుట్టినప్పుడు ఒంటిమీదే కాదు.. మెదడులో, మనసులో కూడా ఏమీ ఉండదు. అమ్మ పంచిచ్చిన స్వచ్ఛమైన రక్తం ఒక్కటే కణాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. పెరిగే క్రమంలోనే మెదడులో ఆలోచనలు, మనసులో భావాలు ఒకొక్కటిగా వచ్చి చేరుతుంటాయి. కాకపోతే అవి మంచివా, చెడువా అనేది తన చుట్టూ ఉండే వేరే మనుషులు చెప్పే మాటలు బట్టి, తాను చూసే దృశ్యాలను బట్టి, తన చుట్టూ లేదా తనకి జరిగే సంఘటనలు బట్టి, తనకెదురయ్యే పరిస్థితులను బట్టి ఇలా పలురకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది..
ఏ మనిషైనా పుట్టిన దగ్గర నుండి, కొంత ఊహ తెలిసే వరకూ తన తల్లితండ్రులకు ఎంతో దగ్గరగా, అత్యంత సన్నిహితంగా ఉంటాడు, పెరుగుతాడు. చెప్పాలంటే, వాళ్ళు తప్ప తనకి వేరే లోకం తెలీదు. మిగతా చుట్టాలు, కుటుంబ సభ్యులు ఇలా ఎంతమంది ఉన్నా అంత సాన్నిహిత్యం ఉండదు. కాబట్టి, ఆ వయసులో ప్రతి విషయానికి తన తల్లితండ్రులనే కొలమానంగా తీసుకుంటాడు, వాళ్లనే అనుకరిస్తాడు మరియు అనుసరిస్తాడు.
వాళ్ళు ఎలా తింటే.. అలా తినాలేమో? ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలేమో? ఇలా...! ఆ తరువాత, తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా.. ప్రారంభ దశలో తన తల్లితండ్రులను గమనిస్తూ, గ్రహించిన విషయాలు తన మీద, తరువాతి తన జీవితం మీద కీలకమైన ప్రభావం చూపుతాయి
ఉదాహరణకి, నాన్నేదో పనిలో ఉన్నప్పుడు.. ఏదైనా విషయంలో సందేహం వచ్చి, వెళ్లి అడిగినప్పుడు నాన్న విసుక్కుంటే.. కాస్త చిన్నబుచ్చుకుంటాడు. ఇది ఒకసారో, రెండుసార్లో జరిగితే పర్లేదు. ఇదే పదే పదే పునరావృతం అయితే.. ఇక తను తరువాత ఏ సందేహం వచ్చినా నాన్నని అడగటం మానేస్తాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు.. దీని తాలూక ప్రభావం ఎలా ఉంటుంది అంటే.. ఓ సందేహం వచ్చినప్పుడు మరే మనిషిని అడగాలన్నా 'నాన్నలా ఆ మనిషి కూడా విసుక్కుంటాడేమో' అని సందేహం కలుగుతుంది. దాంతో తను ఏ సందేహం వచ్చినా తనలోనే దాచేసుకుంటాడు తప్ప.. మరెవరినీ అడిగే ప్రయత్నం చేయడు! మళ్ళీ ఎవరైనా వ్యక్తి తన జీవితంలోకి వచ్చి, వాళ్ళ నాన్న కనబరిచిన తీరుకి విరుద్ధంగా తన తీరుని ప్రదర్శిస్తే.. అతనిలో, ఆ విషయంలో మార్పు వస్తుంది తప్ప.. లేదంటే అది ఎప్పటికీ మారదు.
అందుకే, తల్లితండ్రులు తమ పిల్లలు తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు, వాళ్లపై అకారణంగా కోప్పడటం, అకారణంగా దండించడం వంటివి చేస్తే వాళ్ళు భయస్తులుగా, మందమతి కలిగిన వారుగా ఎదుగుతారు. ఒకోసారి ఆ మార్పు శాశ్వతంగా అలా ఉండిపోవచ్చు.
అదే విధంగా, అతిగా గారాబం చేసినా, పిల్లల్ని పెంచే క్రమంలో అతి జాగ్రత్త చూపించినా.. వాళ్ళు కూడా బయట ప్రపంచం మీద ఎలాంటి అవగాహనా లేకుండా ఎదుగుతారు. కానీ, ఒకానొక సమయం వచ్చాక, అడుగు బయట పెట్టక తప్పదు. అప్పుడు ఒక్కసారిగా బయట మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ప్రతిదీ వింతగా, కొత్తగా, మనసుకి కష్టంగా, అయోమయంగా అనిపిస్తుంది. ఆ అయోమయం క్రమేపి చిరాకుగా మారి, ఆ తరువాత మనసు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. లోకంతో సంబంధం లేనట్టు బతుకుతుంటారు. అందుకే, తల్లితండ్రులు అన్ని విషయాలు ముందు నుండే సందర్భానుసారంగా ఒకొకటి అలవాటు చేయాలి, అర్థమయ్యేలా చేయాలి. అలా చేస్తే తరువాత ఇబ్బంది పడకుండా ఉంటారు.
అంతే కాదు.. అతి గారాబం వల్ల మంచికి చెడుకి తేడా తెలీకుండా ఎదుగుతారు. దాని వల్ల ఒకోసారి విపరీతమైన దుష్పరిణామాలు ఎదురవుతాయి. అందుకే, పొరపాటు చేస్తే మందలించాలి, తప్పు చేస్తే దండించాలి. తెలియక చేస్తే అది పొరపాటు. కాబట్టి, మంచిగా అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పిన తరువాత కూడా.. ఆంటే, తెలిసి చేస్తే అది తప్పు. అప్పుడు దండించాలి. దండించిన తరువాత కూడా మళ్ళీ, ఎందుకు దండించాల్సి వచ్చిందో, ఆ పని ఎందుకని చేయకూడదో ప్రేమగా వివరించాలి. లేదంటే, దండించిన విషయం మనసులో పెట్టుకుని, ద్వేషాన్ని పెంచుకునే ప్రమాదం ఉంది! అంతే కాదు, అది ఎందుకు తప్పో తెలీక, మళ్ళీ మళ్ళీ అదే తప్పుని పునరావృతం చేసే అవకాశం కూడా ఉంటుంది.
అలా తల్లితండ్రులు పిల్లల్ని పెంచే క్రమంలో చేసే కొన్ని పొరపాట్లు, తప్పిదాలు వల్ల.. వాళ్ళు పలురకాలుగా పరివర్తనం చెందుతుంటారు. అలా అని, ఒకడు పతనం అయిపోయినా దానికి పూర్తి బాధ్యత, అలాగే బాగుపడినా దానికి పూర్తి కారణం తల్లితండ్రులు కాదు! ఈ రెంటిలోనూ వాళ్ళది కొంతశాతం వరకూ భాగం ఉంటుంది. మిగతాది ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా తను ఎదిగే క్రమంలో, చదువుకునే చోట్ల, తిరిగే చోట్ల ఎదురైన మనుషులు, పరిస్థితులు, సంఘటనలు కారణమవుతాయి.
కానీ, ఏది ఏమైనా.. ఇలా తల్లితండ్రుల ప్రవర్తన ఆధారంగా, వేరే మనుషుల ప్రవర్తన ఆధారంగా, ఇక ఇతరేతర అంశాల ఆధారంగా మెదడులోకి, మనసులోకి వచ్చి చేరిన ఆలోచనలు, భావాలే తన మిగతా జీవితం ఎలా ఉండబోతుందనేది నిర్ధారిస్తాయి.
వాటిలో ఎక్కువ ఆలోచనలు, భావాలు మంచిగా ఉంటే మంచిగా.. చెడుగా ఉంటే చెడుగా, అదే విధంగా సున్నితంగా, మొండిగా, క్రూరంగా, కర్కశంగా ఇలా పోగుచేసుకున్న ఆలోచనల ఆధిపత్యాన్ని బట్టి రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుగా మనుషులు పరివర్తనం చెందుతారు.
ఏ చెట్టుకి ఆ కాయలే కాస్తాయన్నట్టు.. ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగితే అలాంటి గుణాలు, అలాంటి అలవాట్లు, అలాంటి వ్యక్తిత్వం అలవడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీ ఆలోచనలే నీ జీవితాన్ని నిర్మించే ఇంజినీర్లు.
అయితే ఈ ఆలోచనలతో పాటు మన జీవితాన్ని నియంత్రించేది, నడిపించేది మరొకటి ఉంది. అదే ఆ ఆలోచన యొక్క గర్భం నుండి పుట్టిన ఆశ. ఆలోచన ఆలోచనగా ఉన్నంతవరకూ మనిషి చర్యలు, ప్రతిచర్యలు ఒకలా ఉంటే.. ఆ ఆలోచన ఆశగా రూపాంతరం చెందితే, ఆ ఆశకు సంకల్పం తోడైతే పరిణామాలు మరోలా ఉంటాయి.
ఇక్కడ కూడా అంతే.. సదాలోచన అయితే ఆశ, దురాలోచన అయితే దురాశ. విచిత్రం ఏంటంటే.. ఆలోచన నుండి పుట్టిన ఆశను నెరవేర్చుకునే క్రమంలో మనిషి మెదడులో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇవి ఆ ఆశను నెరవేర్చుకునేందుకు నిన్ను ఉసిగొల్పుతాయి, ప్రేరేపిస్తాయి.
అంటే, పరిస్థితులు, సంఘటనలు, ఇతర మనుషుల ప్రేరణ వల్ల కలిగిన ఆలోచన, ఆ ఆలోచన నుండి జనించిన ఆశ, ఆ ఆశ వల్ల ఏర్పడ్డ ఆశయం.. ఇవే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని రూపకల్పన చేస్తాయి, మనిషి జీవితాన్ని నిర్మిస్తాయి.
డబ్బు మీద యావ ఉన్నవాడు డబ్బు వెనకే పరిగెడతాడు, కళల పట్ల మక్కువ ఉన్న వాడు తానెంచుకున్న కళ కోసమే నిరంతరం తపిస్తాడు, ఎప్పుడూ కొత్తవేవో కనిపెట్టాలి, సృష్టించాలి అనే జిజ్ఞాస ఉన్నవాడు శాస్త్రవేత్త అవుతాడు.. ఇలా ఎవరిలో ఏ ఆలోచన బలంగా ఉంటుందో.. వాళ్ళది అవుతారు.
అలాగే, ఒక మనిషికి అన్ని రకాల భావాలు పరిచయం కావాలనే నియమం లేదు. అంటుంటారు కదా.. అరేయ్! వీడికి జాలనేదే లేదురా! అని. జాలి లేదంటే.. ఆ వ్యక్తి అలాంటి పరిస్థితుల మధ్య పెరిగాడు. తనకెదురైనా పరిస్థితులు తనని కఠినంగా మార్చేశాయి. అలా ఒకో మనిషి కొన్ని కొన్ని భావాలు, భావోద్వేగాలు తెలియకుండా పెరుగుతాడు. అవి తన జీవితంలో తరువాత ఎదురుకావచ్చు కాకపోవచ్చు.
డబ్బు సంపాదిస్తేనే ఒక మనిషికి సంతృప్తి, ప్రశాంతత లభిస్తుంది. అది అతని తత్వం. పేరు సంపాదిస్తేనే ఒక వ్యక్తికి ఆత్మసంతృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. ఇది ఇతని తత్వం. సాటి మనుషులను ప్రేమిస్తూ, తనకున్న జ్ఞానాన్ని నలుగురికీ పంచిపెడుతూ, అందులో ఆనందాన్ని వెతుక్కుంటాడు మరో మనిషి. ఇది ఇతని తత్వం.
అంటే, తనకెదురైన పరిస్థితుల బట్టి అలవడిన ఆలోచనలు, భావాలు ఆధారంగా తనని తాను ఆ విధంగా మలుచుకుని జీవించడమే మనిషి తత్వం!
{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach