"మనిషిలో మనిషిని మాత్రమే చూడగలిగిన వాడే మనిషి"

ఈ సృష్టిలో ప్రతీది విలువైనదే. తమ ఉనికి ఉన్నంత వరుకూ ప్రతీ జీవి ఏదోక విధంగా పనికొస్తుంది. మనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయపడతాయి, కాలానుగుణంగా జీవించటానికి మనకెంతగానో దోహదపడతాయి. పట్టు పురుగులునుండి వెలువడే పట్టుతో వస్త్రాలు తయారుచేసుకుని, వాటిని ధరిస్తున్నాం. గొర్రెల నుండి తీసిన ఉన్ని తో రగ్గులు, స్వేట్టర్లను తయారుచేసుకుని, చలికాలంలో చలినుండి మనల్ని మనం సంరక్షించుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఈ ప్రకృతితో ఏకమై, మనతో మమేకమై చూడటానికి ఎంతో నిరాడంబరంగా కనిపించినా, మనకు ఆధారమైన ఆ సమస్త జీవరాసులు ఎంతో విలువైనవి.

అంతకన్నా విలువైన వాళ్ళు మన మనుషుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు మనకి తెలిసిన సి.ఎమ్మో, పి. ఎమ్మో, కలెక్టరో, యాక్టరో, డాక్టరో కాదు. మనకి తెలిసినా, ఎన్ని సార్లు చూసినా అంతగా గుర్తించుకోలేని, ఎంత శ్రమ పడినా గుర్తింపు లేని జీవితాలను సాగించే కుమ్మరి, కమ్మరి, చాకలి, కూలి వాళ్ళు. నీ కాలి చెప్పులు నీ చేతులతో నువ్వు ఓర్పుగా కుట్టుకున్నప్పుడే, ఓ చెప్పులు కుట్టేవాడి నేర్పు నీకు తెలుస్తుంది. ఒక వారం పస్తునుండిన తరువాత మొదటి ముద్ద తినేటప్పుడే ఓ రైతు పడే కష్టం విలువ తెలుస్తుంది. మన సామాన్లు మనమే మోసుకున్నప్పుడు, మన ఇంటిని మనమే నిర్మించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఓ కూలివాడి శ్రమ మనకు బోధపడుతుంది. ఓ మంగలి వాడి మంగళవాయిద్యాలు ఉంటేనే ఓ వివాహ వేదిక, అందమైన వేడుకగా కనిపిస్తుంది.

ఇలా ఓ కుమ్మరి, కమ్మరి, మంగలి, మనకు ఆధారమైన వీళ్ళందరూ ఎంతో నిరాడంబరంగా జీవిస్తుంటారు. అలాంటి వారికి మనలో చాలా మంది సాటి మనిషనే కనీస గౌరవం కూడా ఇవ్వకపోగా, వాళ్ళ శ్రమను గుర్తించకుండా, ఎంతో దారుణంగా బేరమాడతారు, ఇదేం న్యాయమని వారు మారు మాట్లాడితే ఏదో పెద్ద నేరంలా చూస్తారు. మన మధ్య బ్రతికే వాళ్లకి, మనతో సమానంగా బ్రతికే హక్కులేదు, ఈ సమాజంలో వారికి విలువలేదు, వారికంటూ గుర్తింపు లేదు.

ఒక్కటి మాత్రం నిజం, కళ్ళతో చుస్తే మనిషి చేసే పని మాత్రమే కనిపిస్తుంది, మనసుతో చుస్తే మనిషి కనిపిస్తాడు, అతను చేసే కష్టం కనిపిస్తుంది. ఏ పని చేయనివాడే దరిద్రుడు, ఏదోక పనిచేస్తూ ఒకరికి ఉపయోగపడే వారెవరైనా ధనికుడే.

"మనిషిలో మనిషిని మాత్రమే చూడగలిగిన వాడే మనిషి".

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach