"Don't forget the way you come from!" 

మనిషి జీవితంలో డబ్బును పోగొట్టుకొంటే ఏమీ కాదు, తిరిగి ఏదో ఒక విధంగా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పోగొట్టుకొంటే జీవితంలో ఏంతో కొంత పోగొట్టుకొన్నట్లే, కానీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొంటే జీవితంలో అన్నీ పోగొట్టుకొన్నట్లే అని పెద్దలు, అలాగే మన చుట్టూ ఉండే కొంతమంది చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, విని మర్చిపోతుంటాం. కానీ, చాలా తక్కువ మంది దీన్ని ఆచరణలో పెట్టి వారి జీవితానికి ఒక నిర్వచనాన్ని (definition) అర్థాన్ని సంపాదించి పెట్టుకుంటారు.

ప్రస్తుతం సమాజంలో మనుషులు డబ్బుకు ఇస్తున్న విలువ స్నేహానికి, బంధానికి, బంధుత్వానికి ఇవ్వడం లేదు. ఎంతసేపు నా డబ్బు, నా వడ్డీ, నేను నష్టపోతానేమో అనే అభద్రతా (insecurity) భావంతో జీవిస్తున్నారు తప్ప ఎదుటి వారి ఆవేదనని, అవసరాన్ని అర్థం చేసుకోవడం లేదు.

ధనాన్ని చూసుకుని మిగిలిన జనాన్ని, కార్లు, కోటలు చూసుకుని నువ్వొచ్చిన దారిని మర్చిపోకూడదు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం ‘మనిషి’గా నీకుండాల్సిన లక్షణం. ఒక ‘మనిషి’గా సాటి ‘మనిషి’ని గౌరవించటం నీకుండాల్సిన కనీస జ్ఞానం. మనిషై సాటి మనిషికి కనీస గౌరవం ఇవ్వనివాడు, తానొచ్చిన దారిని మరిచిపోయి ప్రవర్తించే వాడు బ్రతికున్నా శవంతో సమానం!

అందుకే ఎన్నడూ ఆ విలువను పోగొట్టుకొకూడదు. ఒకరిని కించపరచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం, ఒకరు మన వల్ల బాగుంటే చాలు అది మనకు కూడా మంచి జరుగుతుంది అనే భావనతో జీవించడం అనేది గొప్ప వ్యక్తిత్త్వం. మనం కోరే బంధం కంటే మనల్ని కోరివచ్చే బంధం గొప్పది. ఏ బంధం అయినా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఆ బంధం ఎప్పటీకి నిలిచి పోతంది.

ఎవరైతే.... 

  • మనుషులు దగ్గరగా ఉన్నప్పుడే సాటి మనిషి విలువ తెలుసుకోగలుగుతారో, 
  •  సరిపడా ఐశ్వర్యం ఉన్నా కూడా డబ్బు విలువ తెలుసుకుని మెలుగుతారో, 
  •  వయసులో ఉన్నప్పుడే సమయం విలువ తెలుసుకుని మసులుకుంటారో, 

అటువంటి వారే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు, జన్మను సార్ధకత చేసుకోగలుగుతారు!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach