"ఇక్కడ నుండి వెళ్లిపోయేటప్పుడు సంతృప్తి లేకపోయినా పర్లేదేమో గాని, 
పశ్చాతాపం మాత్రం ఉండకూడదు!"

జీవితమేమి అనుకున్నంత పెద్దదేమీ కాదు! సుఖ-దుఃఖాలు, జయాపజయాలే (Victory and defeat) కాకుండా, అనుకోని సంఘటనలు, పరిస్థితుల సమాహారమే (combination) జీవితం! ఇవన్నీ మనకి తెలుసు. కానీ, నిత్యం స్ఫురణ కి రావు. వచ్చినా ఈ క్షణం తీసిపారేస్తాం. ఎందుకంటే, కావాల్సినంత సమయం ఉన్నంతవరకూ దేని విలువ మనలో చాలా మంది తెలుసుకోలేము, గ్రహించలేం.

తీరా సమయం అయిపోయాక, అంటే మన చివరి రోజుల్లోనో, లేదా మన అని అనుకునే వాళ్ళ చివరి రోజుల్లోనో అయ్యో అలా చేసుంటే బావుండేది, ఇలా చేసుంటే బాగుండేది, పలానా వ్యక్తిని అలా అనుండకూడదు, పలానా వ్యక్తితో ఈ విధంగా గడపాల్సింది వగైరా, వగైరా... ఇలా ఓ పశ్చాతాపం (realization) మొదలవుతుంది. పశ్చాతాపం అన్నది సమయం ఉన్నప్పుడే వస్తే మంచిది. మనకి కాలం చెల్లి, ఇక్కడ నుండి వెళ్లిపోయేటప్పుడు సంతృప్తి లేకపోయినా పర్లేదేమో గాని, పశ్చాతాపం మాత్రం ఉండకూడదు. అలా ఉంటే మన ఈ జీవిత ప్రయాణం అసంపూర్ణంగా (incomplete) ముగిసిందని అర్థం.

కచ్చితంగా ప్రతీ ఒక్కరు ఏదోక లక్ష్యం తోనే ఇక్కడికి వస్తారు.. అయితే అవన్నీ పక్కన పెడితే, మొదలుపెట్టిన ఈ ప్రయాణం అసంపూర్ణంగా ముగియకూడదు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి (chase) సాధించడం మాత్రమే మన ఈ జీవితానికి సంపూర్ణత చేకూర్చదు... మన ఈ ప్రయాణంలో భాగమైన ప్రతీ దానికి విలువ ఉంటుంది, దేనికదే ప్రత్యేకం. పుట్టుక, ప్రయత్నం, నేర్చుకోవడం, పోరాటం, వైఫల్యం (failure), విజయం, ప్రేమ, డబ్బు, కీర్తి, బంధాలు, బంధుత్వాలు, బ్రతుకు, అలసిపోవడం, చావు!

వేటికీ ఎవరూ మినహాయింపు కాదు! ప్రతీది ప్రతీ వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తాయి, నిష్క్రమిస్తాయి (exit) మళ్ళీ ప్రవేశిస్తాయి, మళ్ళీ నిష్క్రమిస్తాయి. కానీ, ఏవి ఎంతకాలం మనతో ఉండాలి అనేది మాత్రం, మనం వాటికి ఇచ్చే ప్రాధాన్యతని బట్టి, మనం వాటిని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాన్ని బట్టి, ఆ ప్రయత్నంలో ఉన్న నిజాయితీని బట్టి ఆధారపడి ఉంటుంది.

కాబట్టి, మనమేదో గొప్ప గొప్ప పనులు, త్యాగాలు చేయక్కర్లేదు. అవి ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ, ఓ మనిషిగా మనకు కనీసం మన జీవితం మీద గౌరవం, మనం చేసే చిన్న పనిలో అయినా నిజాయితీ, వీలైనంతగా నిర్లక్ష్యంగా లేకుండా ఉండగలటం.. ఇవి ఉంటే చాలు.

ఏదైనా కావాలి, సాధించాలి అనుకుంటే, ప్రాణం పెట్టి ప్రయత్నిద్దాం... వచ్చే ఫలితం గురించి కాదు, ఆ ప్రయత్నంలో మనం నేర్చుకునే పాఠం గురించి, తద్వారా మనం పొందే సంతృప్తి, ఆనందం గురించి. నిజంగా, మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, ఫలితం ఎక్కడికి పోతుంది.

ఒకవేళ వైఫల్యం ఎదురైనా, మనం నేర్చుకున్న పాఠం ఎలాగు ఉందిగా.. అదే మళ్ళీ సారి ప్రయత్నించినప్పుడు తప్పకుండ మనల్ని గెలిపిస్తుంది.

డబ్బుతో ఎంత సుఖం ఉంటుందో, అంతే దుఃఖం, ఇబ్బందులు ఉంటాయి. అది ఏదో మనం బ్రతకడానికి ఉపయోగపడే ఒక వస్తువులా చూడాలి తప్ప, దాని మీద ఎక్కువ మమకారం పెంచుకోకూడదని నా అభిప్రాయం. కానీ, నువ్వు ఏదైతే ఓ వృత్తిని ఇష్టపడి ఎంచుకుని చేస్తున్నావో, అది నీకెప్పుడూ అండగా ఉంటుంది. అదే నీ ఐశ్వర్యం.

ఇక నువ్వు చేసే పనులు బట్టి, నీ ప్రవర్తనను బట్టి పేరు, కీర్తి నీకు అనుసంధానంగా (in connection with) వస్తాయి. జీవితాన్నే నటించేవాళ్ళకి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కానీ, అన్నిటికన్నా కష్టమైంది నటన. ఏదోక రోజు ఓపిక నశించి, నటించడం మానేస్తే నీకున్నవన్నీ పోతాయి. కాబట్టి, నటించి నీ చుట్టూ ఓ అబద్దపు ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులో బ్రతకడం కన్నా, సహజంగా ఉంటూ, వాస్తవంలో (reality) జీవించడం వేయిరెట్లు సంతృప్తిని ఇస్తుంది.

ప్రేమ; పరాయి అన్న పదానికి తావులేకుండా ఎదురయ్యే ప్రతిఒక్కరినీ ప్రేమిద్దాం. దాన్ని అలుసుగా తీసుకుని, కొంతమంది అవివేకులు, అజ్ఞానులు, జీవితం విలువ తెలియని వాళ్ళు మోసం చేయచ్చు. అది వాళ్ళ తెలియనితనం అని అనుకుని వాళ్ళకి దూరం జరగడం తప్ప, బాధపడటం లో అర్థం లేదు. 

వాళ్ళకి కొద్దిరోజులు మీపై ఆధారపడి బ్రతికే అవకాశం కల్పించా అని గర్వపడండి!

అలాగే, మిమ్మల్ని ప్రేమించే వారికి ఆంక్షలు (conditions) విధించద్దు. ఎందుకంటే, వారు ఆ ఆంక్షలను దాటుకుని మిమ్మల్ని సంతోషపెట్టే క్రమంలో ఒకోసారి చిత్రవధ అనుభవిస్తారు. ప్రేమ అనేది బాధలో ఉన్నప్పుడు భరోసా గా నిలవాలి గాని, అదనపు భారం కాకూడదు. అసలు ఏ ఆంక్షలు లేనిదే ప్రేమ! మనం ప్రేమించే వ్యక్తి సరైన మార్గంలో లేకపొతే చెప్పే హక్కు మనకుంది. కానీ, సక్రమంగా ఉన్నప్పుడు కూడా, మనకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలనుకోవడం ముమ్మాటికీ ప్రేమ కాదు! నిజంగా వాళ్ళ సంతోషమే కోరుకుంటే, మనం అలా మన వ్యక్తిగత ఆలోచనలతో, అభిప్రాయాలతో సంకెళ్లు వెయ్యం. వాళ్ళకి, వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ స్వేచ్ఛకి గౌరవమిస్తాం!

వాళ్ళు మంచి చేస్తే మెచ్చుకుంటాం, చెడు చేస్తే మందలిస్తాం. కానీ, వారిలో ఉన్న మంచి-చెడుల రెంటినీ సమానంగా స్వీకరిస్తాం. ఎందుకంటే, ఆ రెండూ కలిసిందే మనిషి.

అంతా మంచే ఉంటే దేవుడు, అంతా చెడే ఉంటే రాక్షసుడు. రెండూ కలిసి ఉన్నవాడే మనిషి. 

కానీ, రెంటిలో దేని ఆధిపత్యం ఎక్కువ ఉంది, ఇవన్నీ ఆ వ్యక్తి పెరిగిన వాతావరణం, తన చుట్టూ అల్లుకున్న పరిస్థితులు, తనకెదురైన సంఘటనలు నిర్ధారిస్తాయి. కాబట్టి, ఒక మనిషిని ప్రేమిస్తే, తనకు సంబంధించినవన్నీ స్వాగతించే, అర్థం చేసుకునే శక్తి మనకుండాలి.

అలాగే, ఆ వ్యక్తికి కూడా మీ మీద అంతే ప్రేమ, గౌరవం ఉంటే, ఇది తప్పు అని మీరు ఏదైనా చెప్పినప్పుడు, కచ్చితంగా దాని గురించి పునరాలోచన చేస్తారు, కచ్చితంగా ఎంతోకొంత మారతారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ముందుకి సాగాలి తప్ప, మనలో ఉన్న అహాల తో, అహంకారాలతో బంధాల్ని దూరం చేసుకోకూడదు.

చాలా మంది ఈ బంధాలు బంధనాలు అనుకుంటారు. కానీ, మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకుని మసులుకోగలిగితే అవే మనకు బలం!

ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలు. పైన ప్రస్తావించినట్టుగా... అవి మన జీవితంలో ప్రవేశించినప్పుడు వాటి విలువ తెలుసుకుని జీవించగలిగితే.. ఏ ఒక్కరు చివరి క్షణాల్లో పశ్చాత్తాప పడరు! అలాగే, ఏ ఒక్కరి జీవితం అసంపూర్ణంగా ముగియదు!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy