ప్రేమించేవాడే మగాడు, హింసించే వాడు, వంచించే వాడు కాదు...
ఆడవాళ్లు తమ సహనాన్ని పక్కన పడేస్తే ఆయుధం కూడా అక్కర్లేదు వాళ్లకి, ఒట్టి చేతులతో మట్టి కలిపిస్తారు. నిన్ను, నీ రాక్షస జాతిని ఒక్క రోజులో సమాధి చేస్తారు. వాళ్ళ సహనం చచ్చిందో నువ్వు చచ్చావే. వాళ్లకి కోపం వచ్చేలోపు మారిపోయి బ్రతికిపో. ఇది హెచ్చరిక కాదు జరగబోయే నిజం.
ఇప్పుడు తల్లితండ్రులందరికీ,
నాకు మీకున్న అనుభవం ఉండకపోవచ్చు… కానీ, దయచేసి నన్ను మీ ఇంట్లో వాడిని అనుకుని నేను చెప్పే మాటలు ఒక్కసారి మనసు పెట్టి వినండి. చాలా మంది తమ కూతురిని ఎక్కడ చదివించాలి, ఎంత చదివించాలి, ఏమి చదివించాలి, చదువయ్యేక ఎవరికి, ఎలాంటివాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనే ఆలోచనలే తప్ప, నా బిడ్డ రోజూ బయటకి వెళ్తుంది, ఇంట్లో కన్నా బయటే ఎక్కువ సమయం గడుపుతుంది, తాను వెళ్లిన ప్రతీచోటుకి నేను వెళ్ళలేను కదా! కాబట్టి తనకు తగిన జాగ్రత్తలు చెబుదాం అని ఎంతమంది తనని కూర్చోబెట్టి చెబుతున్నారు?
ఒక మంచి స్పర్శకు, చెడు స్పర్శకు ఉన్న తేడా, ఓ మగాడు మంచి ఉద్దేశంతో చూస్తున్నాడా, దురుద్దేశంతో చూస్తున్నాడా, ఇలా చూపులకు గల వ్యత్యాసం ఎంతమంది వివరించి చెబుతున్నారు? దయుంచి, సిగ్గు, మొహమాటం లాంటివి పక్కన పెట్టి ప్రతీ విషయాన్నీ మీ బిడ్డకు కూర్చోబెట్టి వివరించండి. ఇవ్వన్నీ వాళ్ళు తెలుసుకోగలిగితేనే బయట తెలివిగా మసులుకోగలుగుతారు.
అంతేకాకుండా అమ్మాయిలు అయిన మీరు కూడా భయం వలనో, బిడియం వలనో చాలా విషయాలు పెద్దవాళ్ళకి చెప్పకుండా దాచేస్తుంటారు. దాచద్దు, దయచేసి ప్రతీ విషయం వారితో చెప్పండి, పంచుకోండి. అప్పుడే మీ మీ సమస్యలకు తగిన పరిష్కారాలు వాళ్ళు మీకు చెప్పగలరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శ్రేయస్సు కోరుకునేది ఒక్క మీ తల్లితండ్రులు మాత్రమే!
ఇక ప్రభుత్వం...
ఏదైనా జరిగేక చర్యలు తీసుకోవటం కాదు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఫోన్ నెంబర్ లేదా ఓ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆమెను కాపాడలేవు! నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన రక్షక సిబ్బందిని నియమించాలి, అక్కడ రహస్య కెమేరాలను ఏర్పాటు చేసి, అక్కడ ఏం జరుగుతుందో ప్రతీక్షణం కంట్రోల్ రూమ్స్ నుండి వీక్షించాలి, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, వెంటనే అక్కడున్న రక్షకులను అప్రమత్తం చేయాలి, ఇంకా అవసరం అనుకుంటే హుటాహుటిన అదనపు సిబ్బందిని సంబంధిత స్థలానికి పంపించాలి, నగర పరిసరాల్లోనే కాకుండా నగర శివార్లలో కూడా పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేయాలి.
పాఠశాల నుండి విశ్వవిద్యాలయం వరుకూ, అన్ని విద్యాసంస్థలలో ముఖ్యంగా ఆడపిల్లలకు అటు మానసికంగా, ఇటు శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించుకునే విధంగా శిక్షణా తరగతులను నిర్వహించాలి, పల్లె నుండి పట్నం దాక ఉండే ప్రతీ ఆడపిల్లకి ఎట్టి పరిస్థితిలో ఈ శిక్షణ అందాలి. ప్రతీ నెల ప్రతీ గ్రామంలో, ప్రతీ పట్నంలో, పిల్లలకి, తల్లితండ్రులకి కలిపి అవగాహనా సదస్సులు, సమీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి, అలాంటి ఓ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, తమని తాము ఎలా రక్షించుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనే వాటి మీద పూర్తి అవగాహన కల్పించాలి.
ఇలాంటివన్నీ క్రమం తప్పకుండా చేయగలిగితే ఆ అక్రమాలను జరగకుండా ఆపచ్చు, అణగదొక్కచ్చు! మీరు మనసుపెడితే సాధ్యమవుతుంది సర్, ఎంతైనా మన అక్కచెల్లెళ్లు సర్, కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే!
ఇక నేరస్థులకు మరణ శిక్ష విధిస్తున్నారు. కానీ, మీరు చంపేది రోగుల్ని మాత్రమే, రోగాన్ని కాదు. ఇంకా అలాంటి రోగులు మన చుట్టూ, మనతోపాటు జనారణ్యంలో సంచరిస్తున్నారు.
ఆ మృగాల్ని ఇప్పటికిప్పుడు మార్చడం అసాధ్యం! వాళ్ళని అదుపుచేయగలిగేది ఒక్కటే, "భయం"! "తప్పు చేసినాడు తప్పించుకోలేడు" అనే భయం వాళ్ళకి కలగాలి. అంటే అంతటి కఠినమైన చట్టాల్ని తీసుకురావాలి, అటువంటి క్షమించరాని నేరం చేసినవాడిని అంతకంటే కఠినంగా శిక్షించాలి, అలాంటి ఆలోచన ఉన్న మిగతావారి వెన్నులో వణుకు పుట్టించే విధంగా శిక్షలను అమలు చెయ్యాలి. కులం, మతం, జాతి, పలుకుబడి అనే బేధాలు చూపకుండా, వివక్ష లేకుండా, నిష్పక్షపాతంగా శిక్షార్హులైన అందరినీ ఒకే రీతిలో శిక్షించాలి.
అప్పుడు, ఆ విధంగా భారతదేశంలో న్యాయం నాలుగు పాదాలు మీద నడిచినప్పుడు, నడిచివస్తున్న ఆ న్యాయదేవతను చూసి ఆ మృగాలు భయపడతాయి, స్త్రీ స్వేచ్ఛకు అడ్డుపడిన సంకెళ్లు తెగి, మన దేశానికి అసలు సిసలైన సంపూర్ణ స్వాతంత్రం వస్తుంది.
చివరిగా మరొక్కసారి తల్లితండ్రులకి నా విన్నపం:
"పుట్టింది ఆడపిల్ల అయితే ఆమెను ధైర్యానికి నిలువెత్తు రూపంగా పెంచండి, మగపిల్లాడు అయితే ఆడవారిని ఎలా గౌరవించాలో, ఒక అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, స్నేహితుడిగా, భర్తగా తనని నమ్మిన అబలకు ఎలా తోడుగా నిలవాలో, ఎలా సంరక్షించుకోవాలో నేర్పండి, వాడిని ఆదర్శపురుషుడిగా తీర్చిదిద్దక్కర్లేదు, ఓ ఆడదాని గౌరవాన్ని కాపాడే మగాడిలా సమాజంలో నిలబెట్టండి చాలు!"
"ఓ తల్లి లేదా ఓ తండ్రి తన బాధ్యతను విస్మరిస్తే, అది మరో తల్లితండ్రుల పాలిట శాపంగా మారుతుంది. కాబట్టి దయచేసి బాధ్యతను విస్మరించి సమస్యకు పునాది వేయద్దు, మీ బాధ్యతను నిర్వర్తిస్తే, అదే సమస్యను సమాధి చేయగలిగే అంతటి సమర్థత మీకే ఉంది!"